TGPSC Group 1 Marks 2025: టీజీపీఎస్సీ గ్రూప్ 1 మార్కుల్లో డౌటా..? రీకౌంటింగ్‌కు ఇలా దరఖాస్తు చేసుకోండి..
తెలంగాణ గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలను కమిషన్ పొందుపరిచింది. అయితే గ్రూప్1 మార్కుల్లో ఏవైనా సందేహాలుంటే రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ సూచించింది..

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం (మార్చి 10) వెల్లడించిన సంగతి తెలిసిందే. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రాథమిక మార్కుల జాబితాను ఈ మేరకు విడుదల చేశారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలను కమిషన్ పొందుపరిచింది. అయితే గ్రూప్1 అభ్యర్థుల మార్కులను మార్చి 16 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సబ్జెక్టుల వారీగా మార్కులు అందుబాటులో ఉంటాయని వెంకటేశం తెలిపారు. ఫలితాల కోసం తొలుత అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం అభ్యర్ధుల మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీ ఎంట్రీ చేస్తే స్క్రీన్‌పై మార్కులు కనిపిస్తాయి.
మార్కుల్లో ఏవైనా సందేహాలుంటే గ్రూప్-1 అభ్యర్ధులకు రీకౌంటింగ్‌కు అవకాశం ఇస్తున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్కుల రీకౌంటింగ్‌కు మార్చి 24 సాయంత్రం 5 గంటల వరకు పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో సబ్జెక్టు పేపర్ రీకౌంటింగ్ కోసం రూ.1,000 చొప్పున ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని అన్నారు. రీకౌంటింగ్ ముగిసిన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్థులందరి మార్కులను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని అన్నారు. జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించి, ఆ తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు పిలుస్తామన్నారు.
ఈ ప్రక్రియకు అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ముందే సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. అయితే హైకోర్టు అనుమతితో మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కులను కోర్టు ఆదేశాల మేరకు ప్రకటించలేదని అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ మార్కులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 040-23542185, 040-23542187 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని అన్నారు. లేదా helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చని బుర్రా వెంకటేశం తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.