హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని మే 27 విడుదల చేసింది. ఈ పరీక్షపై జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. తుది ఆన్సర్ కీ కూడా ఇటీవల విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన మెరిట్ జాబితా త్వరలోనే వెలువరించనున్నట్లు టీఎస్పీయస్సీ ప్రకటించింది. న్యాయవివాదం పరిష్కారమైతే వారం, పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇక మెరిట్ జాబితా ప్రకటించిన నాలుగైదు రోజుల్లో తుది ఎంపిక ఫలితాలను కూడా ప్రకటించనుంది.
కాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏఈఈ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 సెప్టెంబరులో ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 81,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఆఫ్‌లైన్ పద్ధతిలో రాతపరీక్ష నిర్వహించగా ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను కమిషన్ రద్దు చేసి, కొత్త పరీక్ష తేదీని ప్రకటించింది. ఈ మేరకు మే 8, 9, 21, 22 తేదీల్లో తిరిగి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించింది. మే 8, 9 తేదీల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, అగ్రికల్చర్, మెకానికల్ సబ్జెక్టులకు పరీక్షలు జరుగగా.. మే 21, 22 తేదీల్లో సివిల్ సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు సాధించిన మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనునారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ, కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న 59 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి బుధవారం (ఆగస్టు 16) ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో 19 జూనియర్ అసిస్టెంటు పోస్టులు, ఒక లైబ్రేరియన్ పోస్టు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 21 అసిస్టెంటు ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్లు పోస్టులు, ఎనలిస్టు గ్రేడ్ 2 పోస్టులు 18 ఉన్నాయి. వీటన్నింటినీ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.