TSLPRB: ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్లకు హాజరవుతున్నారా? ఈసారి కొత్త వడబోత విధానం.. పరుగెత్తలేకపోతే ఇంటికే!
డిసెంబర్ 8 నుంచి ప్రారంభంకానున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఈవెంట్ల నిర్వహణలో కొత్తగా వడబోత విధానం అమలు చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెల్లడించింది. గతంలోనైతే..
డిసెంబర్ 8 నుంచి ప్రారంభంకానున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఈవెంట్ల నిర్వహణలో కొత్తగా వడబోత విధానం అమలు చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెల్లడించింది. గతంలోనైతే ఈవెంట్లన్నింటిలో పాల్గొనే అవకాశం ఉండేది. కానీ ఈసారి మొత్తం 12 కేంద్రాల్లో తొలుత పరుగుపందెం నిర్వహించనున్నారు. పురుషులు 1600 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయవల్సి ఉంటుంది. ఒకవేళ పరుగును నిర్ణీత సమయంలో పూర్తి చెయ్యలేకపోతే.. మిగతా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉండదు. వెనుదిరగవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈసారి పురుష అభ్యర్ధులకు ఛాతి కొలతలు కూడా తొలగించారు.
గతంలోనైతే.. తొలుత అభ్యర్థుల శారీరక కొలతల్ని తీసుకునేవారు. దీనిలో పురుష అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలు, మహిళా అభ్యర్థుల ఎత్తును కొలిచేవారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారిని మాత్రమే ఈవెంట్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేవారు.
శారీరక కొలతల్లో అర్హత పొందిన పురుష అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 800 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించేవారు. ఈ ఈవెంట్లలో మొదటి పోటీలో అర్హత సాధించకపోయినప్పటికీ తదుపరి పోటీలను నిర్వహించి.. మొత్తం 5 ఈవెంట్లలో ఏవేని మూడింటిలో ఉత్తీర్ణులైన వారిని సెలెక్ట్ చేసేవారు. మహిళా అభ్యర్థులకైతే 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఈవెంట్లను నిర్వహించేవారు. వీటిల్లో ఏవైనా రెండింటిలో అర్హత సాధిస్తే సరిపోయేది.
ఈసారి మాత్రం తొలుత పరుగుపందెం నిర్వహించి.. దీనిలో ఉత్తీర్ణులైనవారికి మాత్రమే తదుపరి ప్రక్రియ అయిన శారీరక కొలతలకు అనుమతించనున్నారు. ఇక దీనిలో ప్రమాణాలకు అనుగుణంగా కొలతలుంటే లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీలకు అనుమతిస్తారు. వీటిల్లో నెగ్గినవారు మాత్రమే ఫైనల్ రాతపరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో తొలుత నిర్వహించే పరుగు పోటీపై అభ్యర్ధులందరూ ప్రత్యేక దృష్టి నిలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.