
హైదరాబాద్, మే 3: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధుల కోసం పాఠశాల విద్యాశఖ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును మే 2న విడుదల చేసింది. ఈ క్రమంలో ఆలస్య రుసుం లేకుండా మే 16వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇస్తున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు సూచించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు జరుగుతాయి. ఒకటి లేదా రెండు లేదా మూడు సబ్జెక్టులకు పరీక్ష రాయాలనుకునే విద్యార్ధులు రూ.110 చెల్లించాలని, మూడు అంత కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలని ఆయన అన్నారు. పరీక్షలకు రెండు రోజుల ముందు ఫీజు చెల్లించే సదుపాయం కల్పించారు. అయితే మే 17 నుంచి రూ.50 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అన్ని పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. ఫస్ట్ ల్యాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సుల పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.50 గంటల వరకు జరుగుతాయని కృష్ణారావు వివరించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.