తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. శనివారం (డిసెంబర్ 30) సాయంత్రం విద్యాశాఖ ఎస్‌ఎస్‌సీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ముందు అనుకున్నట్లుగానే మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ శనివారం పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. తొలిరోజు అంటే మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, కాంపోజిట్ కోర్సు) పరీక్ష జరగనుంది. మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) పరీక్ష ఉంటుంది. మార్చి 23న మ్యాథమేటిక్స్ (గణితం), మార్చి 26న సైన్స్ పేపర్ 1 (ఫిజిక్స్), మార్చి 28న సైన్స్ పేపర్ 2 (బయోలజీ) నిర్వహిస్తారు. మార్చి 30న సోషల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1వ తేదీన ఒకేషనల్ కోర్సువారికి సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్, 2న రెండవ పేపర్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మాల్ ప్రాక్టీస్ ను అడ్డుకునేందుకు, ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలోనూ కఠినంగా వ్యవహరించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.
మార్చి 20, 22, 24, 25, 27,29 తేదీల్లో సెలవులు ఉన్నాయి. ఇంటర్మీడియేట్ పరీక్షలతో క్లాష్ కాకుండా ప్రభుత్వం పది పరీక్షల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అలాగే పార్లమెంట్ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల కాకుండా తేదీలను రూపొందించింది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను గురువారమే విడుదలైంది. 2024, ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్.. మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి.