Telangana 10th class 2022 exams to commence on May 23: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు (TS SSC Exams 2022) సంబంధించి విద్యార్ధుల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితిపై రాష్ట్ర విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే టెన్త్ 2022 పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ సారి ఒక్క సైన్స్ సబ్జెక్టుకే (Science exam papers) ఒకే రోజు రెండు పరీక్ష పేపర్లు పెడుతుండగా, మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఒక్క పేపర్‌ను మాత్రమే పెడుతున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఐటే హాల్‌టికెట్లలో మే 23న ప్రారంభమయ్యే తెలుగు పరీక్షకు (Telugu Exam) మాత్రం పేపర్-1, పేపర్-2 ఉండటం చూసి విద్యార్థులు ఖంగు తిన్నారు. ఈ విషయమై విద్యాశాఖ స్పష్టత నిచ్చింది.
ఇది కూడా చదవండి: NEET PG 2022 Exam Date: నీట్ పీజీ 2022 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు. గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు జరిగేవి. కరోనా నేపథ్యంలో సిలబస్ తగ్గించి ఏడు పేపర్లకు కుదించారు. సైన్స్‌లో భౌతిక, జీవశాస్త్రం.. వీటికి రెండు పేపర్లు ఉంటాయి. మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్ చొప్పున పరీక్ష ఉంటుంది. మే 27వ తేదీన సైన్స్ పరీక్ష జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.05 గంటల వరకు భౌతికశాస్త్రం పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంతోపాటు జవాబుపత్రం ఇస్తారు. దాన్ని 11.05 గంటల నుంచి 11.10 గంటల మధ్యలో తీసుకుంటారు. ఆ వెంటనే 11.10 గంటల నుంచి 12.45 గంటల వరకు జీవశాస్త్రం పరీక్ష జరుగుతుంది. ప్రశ్నపత్రంతోపాటు మరో జవాబుపత్రం ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సెక్రటరీ కృష్ణారావు తెలిపారు. జవాబుపత్రాలను వేర్వేరు సబ్జెక్టు నిపుణులు, వేర్వేరు మూల్యాంకన కేంద్రాల్లో దిద్దుతారని, అందుకే ఓఎంఆర్ పత్రాలు కూడా రెండు ఉంటాయని ఆయన వివరించారు. తెలుగు సబ్జెక్టుకు ఒక పేపరే ఉంటుందని, కాకపోతే కాంపోజిట్ కోర్సు ఎంచుకున్న వారికి రెండు పేపర్లు ఉంటాయని పేర్కొన్నారు. అందులో పేపర్-1కు 60 మార్కులు, పేపర్-2కు 20 మార్కులు ఉంటాయని ఈ మేరకు స్పష్టత నిచ్చారు.
కాగా ఈ నెల (మే 23) 23 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారులను జిల్లా పర్యవేక్షణ అధికారులుగా విద్యాశాఖ నియమించింది. ఒక్కో అధికారికి ఒకటి నుంచి అయిదు జిల్లాల చొప్పున కేటాయించారు. వారు ప్రతిరోజూ పరీక్షలు జరిగిన తీరుపై నివేదికలు అందజేయాలి. ఈసారి పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డిపార్ట్‌మెంటల్ అధికారులు(డీవో) కూడా సెల్‌ఫోన్లు వినియోగించడానికి వీల్లేదని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. గతంలోనే ఇలాంటి నిబంధన ఉంది. అత్యవసరమైతే పోలీస్ కానిస్టేబుల్ వద్ద ఉన్న ఫోన్‌ను వాడుకోవాలని 2016లో ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమాలకు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.