తెలంగాణ కొలువుల జాతర! వైద్యఆరోగ్యశాఖలోని 12,755 పోస్టుల భర్తీ ఇలానే..ఆ పోస్టులకు నో ఎగ్జాం!

|

Mar 23, 2022 | 4:16 PM

తెలంగాణ రాష్ట్రంలోని వైద్యఆరోగ్యశాఖ (Telangana Medical dept jobs)లో ప్రకటించిన మొత్తం 12,755 పోస్టుల్లో వైద్యులు సహా నర్సులు, ఇతర సిబ్బందిని వైద్య నియామక సంస్థ ద్వారానే..

తెలంగాణ కొలువుల జాతర! వైద్యఆరోగ్యశాఖలోని 12,755 పోస్టుల భర్తీ ఇలానే..ఆ పోస్టులకు నో ఎగ్జాం!
Ts Govt Jobs
Follow us on

Telangana govt jobs 2022 latest news: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన ప్రకటన వెలువడటంతో ఇప్పటికే రాష్ట్రంలో కొలువు జాతర ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా ఆయా శాఖల్లోని ఖాళీలను బట్టి వేరువేరు నియామక సంస్థల ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిల్లో భాగంగా వైద్యఆరోగ్యశాఖ (Telangana Medical dept jobs)లో ప్రకటించిన మొత్తం 12,755 పోస్టుల్లో వైద్యులు సహా నర్సులు, ఇతర సిబ్బందిని వైద్య నియామక సంస్థ ద్వారానే భర్తీ చేయాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. జూనియర్‌ అసిస్టెంట్ల వంటి పాలనాపరమైన పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ (TSPSC)ద్వారా భర్తీ చేయనున్నారు. నియామకాల్లో అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఒక ప్రముఖ సంస్థ నుంచి స్వీకరించాలని నిర్ణయించారు. మొత్తం ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ఎంబీబీఎస్‌ అర్హత గల పోస్టులు సుమారు 1300 ఉండగా.. వైద్యవిధాన పరిషత్‌, వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని ఆసుపత్రుల్లో 3300 వరకు స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇవికాకుండా సుమారు 4000 నర్సుల పోస్టులు ఉన్నాయి. ఇంకా 1700 ఏఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, ఇతర పాలనాపర ఖాళీలు భర్తీ చేయాలి. వీటిలో తొలుత వైద్యులు, నర్సుల పోస్టుల నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయి.

వైద్యుల పోస్టులను నేరుగా వారి అర్హత, అనుభవం, వెయిటేజీ ఆధారంగా తీసుకుంటారు. నర్సులు సహా మిగిలిన పోస్టులన్నింటికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్కుల ప్రాతిపదికన ప్రాథమికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారి అనుభవం, వెయిటేజీని పరిగణనలోకి తీసుకొని తుది నియామకాలు జరుపుతారు. ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికీ వెయిటేజీ ఇవ్వాలని ప్రతిపాదించారు. వీరికి ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆరోగ్యశాఖలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ ప్రతిపాదనల రూపంలో ఓ దస్త్రాన్ని రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వీటన్నింటిపై సీఎం వద్ద చర్చిస్తారు. ఆయన ఆమోదం అనంతరం తిరిగి ఆర్థికశాఖ వద్ద మరోసారి అనుమతులు పొంది, తర్వాత ఆరోగ్యశాఖలో ఖాళీలపై స్పష్టతతో కూడిన ఉత్తర్వులను వెలువరిస్తారని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జీవోలు వెల్లడైన తర్వాత నియామక ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. అదేవిధంగా టీచర్‌ పోస్టులను విద్యాశాఖ డీఎస్సీ లేదా టీఆర్టీ ద్వారా, పోలీస్‌ ఉద్యోగాలను హోంశాఖ ద్వారా, అలాగే నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్‌ సర్వీసుల పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇక ప్రధాన నియామక మండలి అయిన టీఎస్‌పీఎస్సీకి ఏయే బాధ్యతలు అప్పగించాలనే విషయంపై ప్రభుత్వం చర్చలు సాగిస్తోంది.

Also Read:

NEPA Jobs: పదో తరగతి అర్హతతో.. నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీలో గ్రూప్‌ సీ ఉద్యోగాలు..!