Why Young People Are Quitting Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతోపాటు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు కూడా ఈ సారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలూ వదిలేస్తున్నారు. ఉద్యోగం ఇస్తామని పిలుస్తున్నా రావడం లేదు. వేల మంది ఒక్కసారిగా ఇలా వెళ్లిపోవడంతో యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, దుకాణదారులు, మాల్స్, గేటెడ్ కమ్యూనిటీలు తదితరాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వ జాబుల జాతర నడుస్తుండడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలు సంస్థలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో 81,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పోలీసు, గ్రూప్-1తో పాటు.. ఆర్టీఏ, ఎలక్ట్రిసిటీ సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వగా.. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో రూ.30వేల లోపు జీతం ఉన్న ప్రైవేటు ఉద్యోగులంతా ఏమాత్రం ఆలోచించకుండా దీర్ఘకాల సెలవులు పెట్టేసి.. అవసరమైతే మానేసి మరీ పుస్తకాలు చేతబట్టారు. హైదరాబాద్‌లో చదువుకుంటూ ఖాళీ సమయంలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసేవారు సెలవులు పెట్టేశారు. దీంతో కుర్రాళ్లు దొరకడంలేదని ఆహార డెలివరీ సంస్థలు వాపోతున్నాయి. మరోపక్క అనేక మంది క్యాబ్‌లను కూడా పక్కన పెట్టేశారు. ఐటీ సంస్థల్లో కార్యాలయ సిబ్బందీ రావడంలేదు. ప్రస్తుతం 30 శాతం ఐటీ ఉద్యోగులే కార్యాలయాలకు వచ్చి పని చేస్తున్నారు. వారికి సహకారంగా ఉండే సిబ్బంది లేకపోవడంతో ఇంటి నుంచే పని చేసుకోమని సూచించామని ఓ ఐటీ సంస్థ సీఈవో చెప్పారు. ఇప్పుడు 22 నుంచి 40 ఏళ్ల వయసు వారు కొలువులొదిలి లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.