హైదరాబాద్, మే 17: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈఏపీసెట్ 2024 పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలను కూడా విడుదలచేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమాయత్తమవుతోంది. అంతా సవ్యంగా కుదిరితే వచ్చే వారంలోనే ఫలితాలు వెల్లడి చేయనున్నట్లు సమాచారం. ఈఏపీసెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలను కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మే 7 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ ఈఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
ప్పటికే ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్ విడుదల అయ్యాయి. వీటిపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తైంది. వీటి ఆధారంగా తుది ఆన్సర్ కీ రూపొందించి, ఫలితాలను వెల్లడిస్తారు. కాగా ఈ ఏడాది పరీక్షకు దాదాపు 3.54 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా గురువారం (మే 16) నిర్వహించిన బైపీసీ స్ట్రీమ్ ప్రవేశపరీక్షకు 90.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ప్రసాదరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన రెండు విడతలకు కలిపి దాదాపు 44,017 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, అందులో 39,886 మంది హాజరయ్యారని వెల్లడించారు. మొత్తం 142 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌లో రెండు కేంద్రాల్లోనూ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు రేపట్నుంచి (మే 18) 23 వరకు తొమ్మిది విడతల్లో జరుగుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.