
హైదరాబాద్, మార్చి 5: తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 11, 062 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి4న రాత్రి 12 గంటల తర్వాత నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులకు అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కలిగింది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏ జిల్లాలో ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని వివరిస్తూ విద్యాశాఖ వివరణాత్మక నోటిఫికేషన్‌ను కూడా ప్రకటించింది. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, పాత సిలబస్ ప్రకారమే డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. డీఎస్సీ పరీక్షలను ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ల తేదీలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4 నుంచి10 తరగతులను పరిగణనలోకి తీసుకునేవారు. అయితే తాజా నోటిఫికేషన్‌లో మాత్రం 1 నుంచి 7 తరగతులను లెక్కలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
గత ఏడాది డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని, సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్ పూర్తి చేసిన వారే అర్హులని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ పోస్టులకు బీఎడ్ అభ్యర్ధులు పోటీపడే అవకాశం లేదని పేర్కొంది. స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) ఉద్యోగాలకు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎడ్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. ఈ పోస్టులకు నాలుగేళ్ల బీఎడ్ పూర్తి చేసిన వారూ పోటీపడొచ్చు. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసిన వారైతే బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. బీఎడ్, డీఎడ్ చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఇటువంటి వారందరూ డీఎస్సీ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ నాటికి ధ్రువీకరణపత్రాలు పొంది ఉండాలి.
అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితికి సంబంధించి జులై 1, 2023వ తేదీనాటికి 46 సంవత్సరాల లోపు ఉండాలి. కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు నిండి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు ఐదేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ లేదా ఏపీ టెట్ లేదా సెంట్రల్‌టెట్(సీ టెట్)లో క్వాలిఫై అయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించాలనే నిబంధనను తాజాగా ఎత్తివేసిన ప్రభుత్వం.. ఈ పోస్టులకు అందరూ పోటీపడే అవకాశం కల్పించింది. ఎస్టీ రిజర్వేషన్ గతంలో 6 శాతం ఉండగా, దానిని ఈసారి 10 శాతానికి పెంచారు. ఇంటర్ మార్కులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం ఉంటే పరిపోతుంది. గతంలో లోకల్, ఓపెన్‌కోటా రిజర్వేషన్ కింద 80:20 పద్ధతి అమలులో ఉండగా, దానిని ఈసారి 95:5 నిష్పత్తి చొప్పున అమలు చేస్తున్నారు. జీవో-3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేయనున్నారు. అంటే మూడు పోస్టులుంటే అందులో ఒకటి మహిళతో భర్తీ చేస్తారన్నమాట.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.