హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీఆర్‌టీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అక్టోబరు 21వ తేదీ వరకు తుది గడువు కొనసాగనుంది. ఇక దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం ఉంది. ఈ క్రమంలో టీఆర్‌టీ ఆన్‌లైన్ దరఖాస్తుల సంఖ్య అక్టోబరు 17న నాటికి లక్ష దాటింది. ఈ మేరకు మొత్తం 1,01,176 దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఎస్‌జీటీ పోస్టుల్లో 43,634 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్‌కు 16,311 దరఖాస్తులు, స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం సబ్జెక్ట్‌కు 13,547 దరఖాస్తులు అందాయి. తాజాగా టీఆర్టీ పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో తుది గడువును కొంత పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
యూనివర్సిటీల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు యూజీసీ అందించే వివిధ ఫెలోషిప్‌ల ఆర్థిక సాయాన్ని పెంచుతూ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ప్రకటన వెలువరించింది. యూజీసీ జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.31 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇప్పటి వరకూ చెల్లిస్తూ వచ్చారు. తాజా నిర్ణయంతో దాన్ని రూ.37 వేలకు పెంచారు. ఇక సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.35 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం దీనిని కూడా రూ.42 వేలకు పెంచారు. అదేవిధంగా సావిత్రిబాయి జ్యోతిరావు ఫులే ఫెలోషిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ కింద ఇచ్చే ఫెలోషిప్ కూడా పెంపొందించారు.
డీఎస్ కొఠారి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కింద మూడేళ్ల వరకు ఇచ్చే రూ.47 వేల నుంచి రూ.54 వేల వరకు ఇవ్వనుండగా.. దాన్ని రూ.58 వేల నుంచి రూ.67 వేలకు పెంచుతున్నట్లు యూజీసీ తన ప్రకటనలో తెల్పింది. పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేసే మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఫెలోషిప్‌లకు కూడా కొత్తగా పెంచిన విధంగా వర్తిస్తుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ స్పష్టం చేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.