హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టీజీపీఎస్సీ అధికారులు పకడ్భండీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలను సవ్యంగా నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు కూడా. గ్రూప్ 3 హాల్ టికెట్లను కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే రెండో రోజు పేపర్ 3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు.
ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అభ్యర్ధులను లోపలికి అనుమతించరు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి తొలి రోజు తీసుకువచ్చిన హాల్‌టికెట్ కాపీనే తర్వాత రోజు కూడా తీసుకురావాలి. అలాగే నియామక ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ హాల్‌టికెట్‌తోపాటు, క్వశ్చన్ పేపర్లను కూడా తమతోపాటే భద్రంగా దాచుకోవాలని కమిషన్ సూచించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23542185, 040-23542187 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది. కాగా దాదాపు 1380కి పైగా గ్రూప్ 3 పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో పరీక్ష జరుగుతుంది. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున.. మొత్తం 450 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఉండదు. గ్రూప్ రాత పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.