హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల విధానం 2025-26 విద్యా సంవత్సరం నుంచి మారనుంది. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల మాదిరి ఇంటర్ ప్రవేశాలకు కూడా ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న ‘దోస్త్’ తరహాలోనే ఇంటర్‌లో జూనియర్ కాలేజీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (జోస్త్) విధానాన్ని సర్కార్ తీసుకురానుంది. వచ్చే విద్యాసంవత్సరం జూన్ నుంచి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌ను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఆన్‌లైన్‌లో విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని కాలేజీల్లో డిగ్రీ సీట్లను ‘దోస్త్’ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ విధానంతో ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్టపడినట్లైంది. ఇదే తరహాలో ఇంటర్‌లోనూ ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు. గతంలో పదో తరగతిలో గ్రేడింగ్ విధానం ఉండేది. దీంతో మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించలేని పరిస్థితి ఉండేది. కానీ ఈ ఏడాది నుంచి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులకు గ్రేడ్ల స్థానంలో మార్కులను జారీ చేస్తారు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1200 పైచిలుకు ప్రైవేట్ కాలేజీన్నాయి. అయితే కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్ల పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. పైగా పదో తరగతి పరీక్షలకు ముందే అడ్మిషన్లు చేపడుతున్నాయి. పైగా ఇంటర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రాకముందే డిసెంబర్‌లోనే ముందస్తుగా ఈ ప్రక్రియను చేపడుతున్నాయి. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల చేరికలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. కొత్త విధానంతో ఆన్‌లైన్‌లో గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను అందుబాటులోకి తెస్తారు. విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఎంచుకోవాలి. ఆప్షన్లు, మెరిట్‌ను అనుసరించి సీట్లు కేటాయింపు ఉంటుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలన్న తేడాల్లేకుండా ఒకేసారి అడ్మిషన్లు సకాలంలో పూర్తవుతాయి. ఆన్‌లైన్ అడ్మిషన్లతో విద్యార్థి తనకు నచ్చిన కాలేజీలో చేరే అవకాశం ఉంటుంది.
అయితే ఆన్‌లైన్‌లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి ఫీజులను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. సర్కారు కాలేజీల్లో ఉచిత విద్యనందిస్తున్నా.. ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాల ఫీజులు ఎలాగన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో కొత్తగా అడ్మిషన్లు కల్పించకుండా ఉన్న విద్యార్థులనే అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫీజుల ఖరారు చేయకపోవడంతో ఆన్‌లైన్ ప్రవేశాలు సాధ్యమయ్యేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.