
హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి ప్రారంభంకావాల్సిన టీజీ ఎప్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1కి వాయిదా పడింది. దీంతో మంగళవారం నాడు రోజంతా లక్షలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు ఉదయం నుంచి యత్నించి విసిగెత్తిపోయారు. ఇందుకు కారణం.. ఈఏపీసెట్‌లో నాన్‌లోకల్ సీట్లపై ఎటూ తేల్చకపోవడమే. ఇందుకు సంబంధించిన పైల్‌కు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ పడింది.
పదేళ్ల క్రితం తీసుకొచ్చిన రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. పదేళ్లపాటు అమలైన నాన్‌లోకల్ కోటా గడువు గత ఏడాదితో ముగిసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ అమలవుతున్న 70 శాతం ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా, 30 శాతం బి కేటగిరీ (యాజమాన్యం) కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటాలోని సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించేవారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. దీనిపై అధ్యయనం చేయడానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ చేసిన సిఫారసులు విద్యాశాఖకు చేరగా, సంబంధించిన ఫైల్‌కు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు.
దీంతో మంగళవారం నుంచి ఈఏపీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ వాయిదాపడింది. నాన్ లోకల్ కోటాపై జీవో విడుదలైతే.. దాని ప్రకారం నిబంధనలు అమలవుతాయన్న కండీషన్ తెరపైకి వచ్చింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.