హైదరాబాద్, మార్చి 15: మెగా డీఎస్సీకి ముందే టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ 2024 గురువారం (మార్చి 14) విడుదలైంది. మార్చి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు. టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపిన కొద్దిసేపట్లోనే టెట్ నోటిఫికేషన్ వెలువడం విశేషం. కాగా గతేడాది (2023) సెప్టెంబరులో నిర్వహించిన తెలంగాణ టెట్ పేపర్ 1 పరీక్షలో 82,489 మంది అంటే 36.89 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత పొందారు. ఇక పేపర్ 2 పరీక్షలో 29,073 మంది అంటూ 15.30 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
తెలంగాణ మెగా డీఎస్సీ పోస్టుల భర్తీ కోసం మార్చి 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 2,629 , భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు 220, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ 796 ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నవారు తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత చేసింది. తాజాగా టెట్ నోటిఫికేన్ విడుదలైన నేపథ్యంలో.. డీఎస్సీకి భారీగా దరఖాస్తులు వెళ్లువెత్తే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.