TG TET 2024 Edit Option: టెట్‌ వివరాల్లో తప్పుల సవరణకు ఛాన్స్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

|

Nov 17, 2024 | 3:34 PM

తెలంగాణ టెట్‌ 2024 దరఖాస్తు గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది..

TG TET 2024 Edit Option: టెట్‌ వివరాల్లో తప్పుల సవరణకు ఛాన్స్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?
TG TET 2024 Edit Option
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 17: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్‌ 7వ తేదీ నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తులు మరో మూడు రోజుల్లో ముగియనున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌16వ తేదీ నాటికి మొత్తం 1,26,052 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్‌ 1కు 39,741 మంది, పేపర్‌ 2కు 75,712 మంది, రెండిటికీ కలిపి 10,599 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో మూడు రోజుల గడువున్నందున మరో 50 వేల దరఖాస్తులు అందవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అయితే ఇప్పటి వరకూ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు.. తమ అప్లికేషన్‌లో పొందుపరిచిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే నవంబర్‌ 22 వరకు సవరించుకోవచ్చని టెట్‌ ఛైర్మన్‌ ఈవీ నరసింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా టెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు నవంబర్‌ 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇక రేవంత్‌ సర్కార్‌ ఈసారి టెట్‌ దరఖాస్తులకు ఫీజు భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. గతంలో ఒక్కో పేపర్‎కు రూ.1000లు, రెండు పేపర్లకు రూ.2 వేల ఫీజు చెల్లించవల్సి వచ్చేది. ప్రస్తుతం దాన్ని రూ.750కి కుదించారు. ఇక రెండు పేపర్లు రాసేవారికి రూ.1000గా ఫీజు నిర్ణయించింది. అంతేకాకుండా ఈ ఏడాది మేలో నిర్వహించిన టెట్‌లో క్వాలిఫై అయినా, కాకపోయినా.. అందులో దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఈసారి టెట్‌కు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్లో అప్లై చేసుకోవచ్చు.

ఇక వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష ఉంటుంది. ఇక టెట్‌ 2024 ఫలితాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. మొత్తం 8 భాషల్లో టెట్‌ పరీక్ష జరగనుంది. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. మొత్తం 150 మార్కులకు టెట్‌ పరీక్ష ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.