హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు మరో రెండు రోజుల్లో విడుదలకానున్నాయి. తెలంగాణ టెట్ 2023 హాల్ టికెట్లు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తాజా ప్రకటనలో వెల్లడించారు. టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తన ప్రకటనలో వివరించారు. ఇక టెట్ పరీక్షసెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
కాగా టెట్ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు పేపర్-1, పేపర్-2కు కలిపి మొత్తం 4.78 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిల్లో పేపర్-1 పరీక్షకు 2,69,557 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కు 2,08,498 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లకు కలిపి 1,86,997 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,91,058 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ టెట్-2023 హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి.
కాగా 2022లో నిర్వహించిన టెట్ పరీక్షకు 6.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య లక్షన్నరకు తగ్గింది. కేవలం 4.78 లక్షల దరఖాస్తులు అందాయి. ఇక టెట్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష తేదీల్లో సెప్టెంబరు 15న నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టెట్ పరీక్ష అనంతరం ఇదే నెలలో ఫలితాలు కూడా ప్రకటించనుంది. సెప్టెంబర్ 27న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలు ఒకే చోట వస్తాయో, వేరేవేరు చోట్ల వస్తాయో తెలియక అందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగం పొందాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరనే విషయం తెలిసిందే. టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. డీఎస్సీలో టెట్‌కు వెయిటేజీ ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.