
తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు ఆందోళన బాట పట్టాయి. తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం పోరాటనికి దిగాయి. దసరాకు ముందు కాలేజీల బంద్ ప్రకటనతో ప్రభుత్వం దిగివచ్చి 1200 కోట్ల రూపాయల బకాయిలను రెండు విడతల్లో చెల్లించేందుకు హామీ ఇచ్చింది. కానీ దసరా నాటికి 300 కోట్లు మాత్రమే చెల్లించి మిగతా వాటిని ఇప్పటివరకు ఇవ్వలేదని కాలేజీ యాజమాన్యాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో రెండేళ్లు, ఇప్పుడు రెండేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకున్నా కాలేజీలను నెట్టుకొచ్చామని ఇప్పుడు కాలేజీలు నడిపే పిరిస్థితి లేనందున సమ్మెకు దిగాలాని నిర్ణయించిన ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది.
ఆదివారం అత్యవసరంగా ఉన్నత విద్య సంస్థల సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. ఇందులో నాలుగు ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.
ప్రధాన డిమాండ్లు:
1. నవంబర్ 1 నాటికి ఇటీవల ప్రభుత్వం ఇస్తామన్న వాటిలోని 900 కోట్ల రూపాయలు బకాయిలన నిధులు విడదల చేయాలి.
2. 2024-25 అకాడమిక్ ఇయర్ వరకు ఉన్న పెండింగ్ 9 వేల కోట్ల రూపాయల బకాయిలను 2026 మార్చి 31 నాటికి విడుదల చేయాలి
3. ప్రస్తుత అకాడమిక్ ఇయర్ 2025-26 ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వచ్చే ఏడాది జూన్ చివరి నాటికి ఇవ్వాలి
4. ఏఐసీటీఈ తీసుకొచ్చిన కొత్త కోర్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఎన్వోసీలన వెంటనే కాలేజీలకు ఇవ్వాలి
ఈ నాలుగు ప్రధాన డిమాండ్లను రాష్ట్ర సర్కారు ముందుంచిన ఉన్నత విద్య సంస్థల సమాఖ్య.. నవంబర్ 2 డెడ్ లైన్ విధించింది. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే నవంబర్ 3 నుంచి ఉన్నత విద్యాసంస్థలు అంటే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్. బీఈడీ, బీఎడ్, ఎంబిఏ, ఎంసీఏ, నర్సింగ్, పీజీ, డిగ్రీ కాలేజీలను మూసివేయనున్నట్లు FATHI( ఫెడరేషన్ ఆఫ్ అసోషియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్సిట్యూషన్) ప్రకటించింది. బంద్ కాలంలో రోజుకో తరహాలో నిరసన కార్యక్రమాలు నిర్వహరించనున్నట్లు ప్రకటించారు. 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశ ఉందని కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. విజిలెన్స్ దాడులు అంటూ బెదిరిస్తే వెనక్కి తగ్గేది లేదని. బకాయిలు చెల్లించేదాకా ఆందోళన బాట వీడేది లేదని ఫతి స్పష్టం చేసింది.