SI, Constable Result Date: ముగిసిన తెలంగాణ పోలీస్ నియామక రాత పరీక్షలు.. ఫలితాలు విడుదలయ్యేది అప్పుడే
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుళ్ల తుది రాతపరీక్షలు ఏప్రిల్ 30తో ముగిశాయి. ఎస్సై స్థాయి తుది రాత పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. ఆదివారం రెండు సెషన్లలో జరిగిన కానిస్టేబుల్ స్థాయిలో శాంతిభద్రతలు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగం పరీక్షలతో పోలీస్ నియామక పరీక్షలు..

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుళ్ల తుది రాతపరీక్షలు ఏప్రిల్ 30తో ముగిశాయి. ఎస్సై స్థాయి తుది రాత పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. ఆదివారం రెండు సెషన్లలో జరిగిన కానిస్టేబుల్ స్థాయిలో శాంతిభద్రతలు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగం పరీక్షలతో పోలీస్ నియామక పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 183 కేంద్రాల్లో జరిగిన శాంతిభద్రతల విభాగం పరీక్షలకు 1,09,663 మంది అభ్యర్థులకు గానూ 1,08,055 మంది (98.53 శాతం) హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ పరీక్షలకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 8 పరీక్ష కేంద్రాల్లో 6,801 మందికిగానూ 6,088 (89.52 శాతం) మంది హాజరయ్యారు. రెండు విభాగాల్లో కలిపి 98.01 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
కాగా గత నెల 12న ప్రారంభమైన తుది రాతపరీక్షలు ఏప్రిల్ 30 నాటికి ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని త్వరలోనే విడుదల చేస్తామని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వివిశ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోలీస్ నియామకాలకు సంబంధించిన తుది ఫలితాలు జూన్‌లో విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ మొదటి వారంలో ఫలితాలు వెలువడనున్నాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.