హైదరాబాద్, నవంబర్ 12: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లా విద్యార్ధులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీపికబురు చెప్పింది. లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన హెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 14 నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి షెడ్యూల్ విడుదల చేశారు. కౌన్సెలింగ్‌కు నవంబర్ 11న నోటిఫికేషన్ విడుదలైంది. ఇతర వివరాలు అధికారిక షెడ్యూల్ నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నీట్ పీజీ, నీట్ ఎండీఎస్-2024 ప్రవేశ పరీక్షల తాత్కాలిక తేదీలను మెడికల్ సర్వీసెస్ జాతీయ పరీక్షల బోర్డు తాజాగా ప్రకటించింది. నీట్ పీజీ పరీక్ష 2024 మార్చి 3వ తేదీన జరగనున్నట్లు వెల్లడించింది. నీట్ ఎండీఎస్ పరీక్ష ఫిబ్రవరి 9వ తేదీన జరగనుంది. ఈ మేరక పరీక్ష తేదీలను వెల్లడిస్తూ ప్రకటన వెలువరించింది.
సమ్మెటివ్-1 పరీక్షల షెడ్యూల్ మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో నవంబరు 14 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను నవంబర్ 24కు వాయిదా వేసింది. డిసెంబరు 6 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇక నవంబర్ 24, 25 తేదీల్లో పదోతరగతి కాంపోజిట్ తెలుగు పరీక్షలు జరగనున్నాయి. అన్ని తరగతులవారికి నవంబర్ 28 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు ఉన్నచోట మాత్రమే టోఫెల్ పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన వెయ్యి పాఠశాలల్లో మాత్రం 8, 9 తరగతులకు నవంబర్ 28 నుంచి పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.
ఏపీ పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబరు 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. వరుసగా రూ.50, రూ.200, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించవచ్చిన ఆయన వివరించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.