Inter Practical exams 2026: ఈసారి సీసీటీవీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ పక్కా నిఘాలోనే.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు!
TG Intermediate Practical Exam 2026 Dates: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఇకపై మరింత కట్టుదిట్టమైన నిఘా నీడలో ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్ లేకుండా జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత ఏడాది కూడా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చి.. ఇంటర్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా..

హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఇకపై మరింత కట్టుదిట్టమైన నిఘా నీడలో ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్ లేకుండా జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత ఏడాది కూడా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చి.. ఇంటర్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ సారి ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలను పెద్దసంఖ్యలో రంగంలోకి దించనున్నారు. అటు సీసీ కెమెరాలు.. ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిఘాలో ‘కమాండ్ కంట్రోల్’ పరిధిలోని కళాశాలల్లోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతారు. గత ఏడాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో బోర్డు నుంచి ప్రాక్టికల్స్ పర్యవేక్షణ కోసం డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించలేదు. చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అనేక ప్రైవేట్ కాలేజీల్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ సారి అన్ని పరీక్షా కేంద్రాల్లో పక్కాగా సీసీ కెమెరాలు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిపార్ట్‌మెంటల్ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు.
ఆ స్కూళ్లలో ప్రాక్టికల్స్‌కు నో ఛాన్స్!
కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు పాఠశాల విద్యాశాఖ పరిధిలో గురుకులాలు ఆయా శాఖల పరిధిలో ఉన్నాయి. దీంతో వాటిల్లో సీసీ కెమెరాలున్నటికీ.. అవి బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయలేదు. ఈ స్కూళ్ల పరిధిలో ఏదైనా అక్రమం జరిగినా చర్య తీసుకునే అధికారం బోర్డుకు లేదు. అందుకే ఈ సారి వాటిల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు తొలగించింది. దీంతో అక్కడి విద్యార్ధులంతా ప్రాక్టికల పరీక్షలకు ప్రభుత్వ కాలేజీలకు రావాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు మాత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉన్నందున వాటిల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. కాగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ఇటీవల సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




