
హైదరాబాద్, జనవరి 3: ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 1బీ సబ్జెక్టును తలచుకుంటేనే విద్యార్థుల వెన్నులో వణుకు పుడుతుంది. అత్యంత కఠినంగా ఉంటే ఇంటర్ మ్యాథ్స్ సిలబస్ విద్యార్థులను ఇంతకాలం భయపెడుతూ వచ్చింది. ఇకపై ఈ సబ్జెక్టు కాస్త సులభంకానున్నది. మ్యాథ్స్‌లో అత్యంత కఠినమైన సిలబస్‌ను పుస్తకాల నుంచి ఇంటర్ బోర్డు తొలగించింది. అలాగే మ్యాథ్స్‌తోపాటు కెమిస్ట్రీ కూడా విద్యార్ధులకు వణుకు పుట్టించే సబ్జెక్టే. ఈ సబ్జెక్టు కూడా విద్యార్థులను వణికిస్తుంది. దీంతో కెమిస్ట్రీలోనూ 30 శాతం సిలబస్‌కు కోతపడనుంది. అలాగే ఇంటర్‌లో మరికొన్ని సబ్జెక్టుల్లోనూ 20 శాతం మేర సిలబస్ తగ్గించారు. తగ్గిన సిలబస్‌తోపాటు తొలిసారి ఇంటర్ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్ సైతం ముద్రిస్తున్నారు. వీటిని మల్టీకలర్స్‌తో ముద్రిస్తారు. మారిన సిలబస్‌తో కొత్త పుస్తకాలను 2026 -27 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తీసువస్తారు.
ఈ మేరకు ఇంటర్ సిలబస్‌ను అధికారులు సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఇంటర్ సిలబస్ అధికంగా ఉన్నట్టు నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. దీంతో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని కొత్త సిలబస్ రూపకల్పన చేశారు. ఇక తెలుగు, హిస్టరీ పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఈ సిలబస్ ఆధారంగానే తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రించనుంది. ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలోగా కొత్త పుస్తకాలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు అధికారులు కార్యచరన రూపొందిస్తున్నారు. కొత్త సిలబస్‌పై వేసవి సెలవుల్లో జూనియర్ కాలేజీల లెక్చరర్లకు శిక్షణ ఇస్తారు.