
హైదరాబాద్, మార్చి 4: ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈసారి కూడా ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేస్తున్నట్లు తాజాగా ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు అంటే ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అయితే కాస్త ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే ఆందోళన లేకుండా రాసుకోవచ్చని, తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ముందుగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో విద్యార్ధులకు ఓఎంఆర్ పత్రాన్ని అందజేస్తారు. విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిపై విద్యార్ధుల వివరాలు సరిగ్గా ఉన్నయో? లేదో? చెక్ చేసుకోవాలి.
కాగా మార్చి 5 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 6 నుంచి మొదలయ్యే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం ఉంది. వీరిలో అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా.. 4,99,443 మంది వరకు అమ్మాయిలున్నారు. మొత్తం 1,532 (సెల్ఫ్ సెంటర్లు 49) పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.