
తెలంగాణలో గవర్నమెంట్ ఉద్యోగాలు గాల్లో దీపంలా మారిపోయాయి. ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సర్కారు నౌకర్ల కష్టపడి చదివి దక్కించుకున్నవారికి ఆ కొలువులు గ్యారంటీ లేకుండా పోతున్నాయి. ఇందుకు పరీక్షల నిర్వహణ లోపాలు, కోర్టు కేసులే కారణం. మొన్న గ్రూప్ 1 ఫలితాలు రద్దు అన్న హైకోర్టు తీర్పుతో ఎంపికైన అభ్యర్థులు అవాక్కైతే.. ఇవాళ ఏకంగా ఐదేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారి జాబ్ లు హుష్ కాకి అంటు ఉన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఝలక్ ఇచ్చింది. మంగళవారం హైకోర్టు 2015 నోటిఫికేషన్ తో వచ్చిన 2019లో గ్రూప్ -2 సెలెక్షన్ జాబితాను రద్దు చేసింది. 1032 మంది ఉద్యోగుల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
2015లో నోటిఫికేషన్ వస్తే 2016లో పరీక్షలు జరిగాయి. పరీక్షల నిర్వహణ సమయంలో ఓఎంఆర్ షీట్ల విషయంలో నెలకొన్న గందరగోళం కొందరికి నేడు గుదిబండగా మారింది. ఇన్విజిలేటర్లు కన్ఫూజ్ కావడం క్వశ్చన్ పేపర్ బుక్ లెట్ నంబర్, ఓఎంఆర్ నంబర్ ఒకటే ఉండాలనుకోవడంతో అసలు సమస్య తలెత్తింది. ఈ సమస్య పరిష్కారం కోసం అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి చిన్నచిన్న పొరపాట్లు ఉంటే ఓకే కానీ పార్ట్ బీ లో మార్పులు, వైట్ నర్ వాడినట్లు ఉంటే ఆ పేపర్ ను కౌంట్ చేయొద్దని నాటి సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది. హైకోర్టు ఆదేశాలు, కమిటీ సిఫార్సుల ఆధారంగా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇచ్చామని టీజీపీఎస్సీ తెలిపింది. ఆ ఫలితాలను పలువురు అభ్యర్థులు హైకోర్టులో సవాలు చేశారు. గతంలోనే విచారణ ముగియగా తాజా తీర్పుతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ లో సవాలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు కోర్టు తీర్పుపై బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఉద్యోగులకు నష్టం జరగదని.. కోర్టులో అప్పీల్ కు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మూల్యాంకనంలో ఎక్కడా దురుద్దేశం, పక్షపాత ధోరణికి అవకాశం ఉండదని.. అలాంటప్పుడు నియామక ప్రక్రియను రద్దు చేయడానికి ఉండదని అన్నారు. గతంలో జరిగిన పరీక్ష కావడంతో అధికారులు చైర్మన్, బోర్డు మెంబర్లకు కేసు వివరాలు, పరీక్ష నిర్వహణ, ప్రక్రియకు సంబంధించిన అంశాలను వివరించారు. లీగల్ గా డివిజన్ బెంచ్ లో స్ట్రాంగ్ కౌంటర్ వినిపించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేయడం సంచలనంగా మారగా.. ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఆ తీర్పుపై స్టే విధించడంతో ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. అయినా ఇంకా గ్రూప్ 1 కేసు కోర్టులో నలుగుతూనే ఉంది. ఇలా రాక రాక వచ్చిన నోటిఫికేషన్లకు కష్టపడి చదివి పరీక్ష రాసి జాబ్ కొట్టినా దానికి గ్యారంటీ లేకుండా పోయింది. నోటిఫికేషన్లు వచ్చేదాక వెయిట్ చేస్తే ఏజ్ బార్ అయిపోవడం.. వచ్చిన నోటిఫికేషన్ లో జాబ్ సాధిస్తే కోర్టు కేసులతో ఊడిపోవడం.. ఇలా సర్కారు కొలువుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు నిరాశ ఎదురవుతోంది. మరి నియామక ప్రక్రియ పారదర్శకత పెంచేనా.. యువతకు భరోసా నిచ్చేనా.. ఇంతకీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ సమస్యకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.