
హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో 118 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)ల నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 285 ఏపీపీ పోస్టులు ఉండగా.. వాటిల్లో 120 మంది మాత్రమే సర్వీసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలకు ప్రభుత్వం అనుమతి తెలపడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ (డీవోపీ) త్వరలోనే పెద్దమొత్తంలో పోస్టులు భర్తీ చేయనుంది. 2022లో ప్రభుత్వం చివరిసారిగా 92 ఏపీపీ పోస్టులకు నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. శిక్షణ తర్వాత వారంతా విధుల్లో చేరారు. వీరిలో కొందరికి పదోన్నతులు దక్కడంతో దాదాపు 165 ఏపీపీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇందులో 118 పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేయనుంది.
తెలంగాణలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్ధులకు ఉపాధి అవకాశాలు అందించేందుకు పలు పాలిటెక్నిక్ కోర్సులను అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖతో పాటు వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల పరిధిలో డిప్లొమా కోర్సులను అందిస్తున్నారు. అయితే సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని డిప్లొమా కోర్సులకు అధిక రుసుంలు విద్యార్ధులకు భారంగా మారుతున్నాయి. సాంకేతిక విద్య పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతర కేటగిరీలకు రూ.600 ఉంది.
అయితే ఉద్యాన, వ్యవసాయ, వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రం ఎస్సీ, ఎస్టీలకు రూ.600, మిగిలిన వారికి రూ.1,100 దరఖాస్తు రుసుము ఉంది. పాలిటెక్నిక్‌లలో సాంకేతిక కోర్సులకు వార్షిక రుసుం రూ.3,800గా ఉంది. ఉద్యాన, వ్యవసాయ, వెటర్నరీ కోర్సులకు మొదటి సెమిస్టర్‌కు ఏకంగా రూ.19,120 చెల్లించాల్సి వస్తుంది. ఈ ఫీజులను చూసి విద్యార్థులు గుడ్లు తేలేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఫీజులు తగ్గించాలని మొరపెట్టుకుంటున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.