
హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదికి తొలి విడత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక మలివిడత నోటిఫికేషన్‌పై కసరత్తు ప్రారంభమైంది. టెట్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్.. ఈ మేరకు ఈ ఏడాదికి రెండో సారి టెట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్ ఈ ఏడాది జూన్‌లో జారీ చేశారు. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేయగా.. జులై 22న ఫలితాలు కూడా వెల్లడించారు.
ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండో విడతకు నోటిఫికేషన్ నవంబర్‌లో ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారంతా తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సి ఉంది. దీంతో నవంబర్‌లో విడుదల చేసే టెట్‌కు ప్రభుత్వం ముందుగా జీవోలో సవరణ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.
తాజాగా విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉపాధ్యాయుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పాస్ కాని ఉపాధ్యాయులు సుమారు 45 వేల మంది వరకు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు తేల్చాయి. మరోవైపు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డిసెంబరు 12 వరకు సెలవులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇన్‌ఛార్జి కార్యదర్శిగా ఉన్న శ్రీదేవసేన దీనిపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే టెట్‌పై రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. టెట్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి..
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.