TGEMR Gurukula Admissions: తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే

|

Jan 24, 2025 | 7:07 AM

తెలంగాణ రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఫిబ్రవరి 16వతేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు..

TGEMR Gurukula Admissions: తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే
TGEMR Schools Admissions
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య అందిస్తారు. ఇంగ్లిస్ మీడియంలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్యాబోధన చేస్తారు. గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్‌ ట్రైబ్‌ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఫిబ్రవరి 16, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా వీటిల్లో అడ్మిషన్లు ఇస్తారు.

తెలంగాణ ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు పొందే విద్యార్ధులకు ఈఎంఆర్‌ఎస్‌ సెలెక్షన్‌ టెస్ట్‌ (ఈఎంఆర్‌ఎస్‌ఎస్‌టీ)- 2025 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 16వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల స్కూల్‌లో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున ఉంటాయి. ఇలా మొత్తం 23 విద్యాలయాల్లో 1,380 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 690 బాలురు, 690 బాలికలకు సీట్లు కేటాయిస్తారు. ఏకలవ్య గురుకులాల్లో ఆరో తరతగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో 5వ తరగతి చదివి లేదా చదువుతూ ఉండాలి. ఇంటివద్ద ఐదో తరగతి చదివిన విద్యార్ధులు కూడా అర్హలే. అలాగే విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు మించకూడదు. విద్యార్ధుల వయసు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే మార్చి 31, 2012 నుంచి మార్చి 31, 2015 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్షలో వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందంటే..

ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీలో 50 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్‌లో 25 ప్రశ్నలు, తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 16, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 చెల్లించాలి. మార్చి 16వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. మార్చి 31, 2025న ఫలితాలు వెల్లడిస్తారు. మొదటి దశ ప్రవేశాలు మార్చి 31, 2025 నుంచి ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాల 2025 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.