10th Class Exams: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. ఆ పరీక్షల్లో కీలక మార్పులు!

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యాశాఖ కీలక మార్పు తీసుకురానుంది. ఈ సారి జరిగే పబ్లిక్‌ పరీక్షల్లో ఓఎంఆర్‌ పత్రంలో వివరాలను నింపడం నుంచి తదితర అంశాలను కొత్తగా చేర్చనున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రీ ఫైనల్‌ పరీక్షల్లోనే నమూనా ఓఎంఆర్‌ పత్రాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో మార్చి 6 నుంచి జరగనున్న ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో టెన్త్‌ విద్యార్ధులందరికీ ఓఎంఆర్‌ పత్రాలను..

10th Class Exams: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. ఆ పరీక్షల్లో కీలక మార్పులు!
10th Class Exams

Updated on: Feb 13, 2025 | 3:34 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పు తీసుకురానున్నారు. అదేంటంటే.. పబ్లిక్‌ పరీక్షల్లో ఓఎంఆర్‌ పత్రంలో వివరాలను నింపడం నుంచి తదితర అంశాలను కొత్తగా చేర్చనున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు ప్రీ ఫైనల్‌ పరీక్షల్లోనే నమూనా ఓఎంఆర్‌ పత్రాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రీ ఫైనల్‌ పరీక్షలు మార్చి 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో టెన్త్‌ విద్యార్ధులందరికీ ఓఎంఆర్‌ పత్రాలను అందించనున్నారు.

విద్యార్ధులకు అందించే ఈ ఓఎమ్‌ఆర్‌ పత్రాల్లో ప్రతి విద్యార్థి తనకు ఇచ్చిన ఆన్సర్‌ బుక్‌లెట్‌ సంఖ్యను రాయాల్సి ఉంటుంది. అలాగే దానిపై సంతకం కూడా చేయాలి. విద్యార్థికి సంబంధించిన ఇతర వివరాలు కూడా అందులో ముందుగానే ముద్రించి ఉంటాయి. వాటిని విద్యార్థులు సరిచూసుకోవాలి. వివరాల్లో తప్పులున్నా.. ఆ ఓఎంఆర్‌ తనది కాకపోయినా.. విద్యార్ధులు వెంటనే ఇన్విజిలేటర్‌కు చెప్పాల్సి ఉంటుంది. అలాగే వారిచ్చే ఇతర నామినల్‌ రోల్‌ పత్రంలో సరైన వివరాలను రాయాల్సి ఉంటుంది.

ఇక ఈ పరీక్షలు ముగిసిన తర్వాత మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల్లో ప్రతిరోజూ ఓఎంఆర్‌ పత్రాలను విద్యార్థులకు అందిస్తారు. నేరుగా పబ్లిక్‌ పరీక్షల్లో ఓఎంఆర్‌ పత్రాలను ఇవ్వడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల కొందరు విద్యార్ధులు తప్పులు చేసే అవకాశం ఉంది. మరికొందరికి సమయం వృథా అయ్యే ఛాన్స్‌ ఉంది. దీన్ని నివారించేందుకు ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్‌ పత్రాలను ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దీనివల్ల విద్యార్ధులకు కొంత సాధన అవుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. అలాగే గత ఏడాది వరకు 4 పేజీల మెయిన్‌ బుక్‌లెట్‌ తొలుత జారీ చేసి.. అది సరిపోకపోతే అదనపు షీట్లను ఇచ్చేవారు. దీంతో అదనపు షీట్ల సంఖ్యను కూడా ఓఎంఆర్‌ పత్రంపై రాసేవారు. అయితే ఈసారి మాత్రం ఇంటర్మీడియట్‌ తరహాలో 24 పేజీల బుక్‌లెట్‌ను పదో తరగతి విద్యార్ధులకు కూడా ఇస్తున్నారు. దీనివల్ల బుక్‌లెట్‌పై అదనపు పత్రాల సంఖ్య రాయవల్సిన అవసరం ఉండదు. ఇలాంటి మార్పులన్నింటి దృష్ట్యా ప్రీ ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్‌ పత్రాలను అందించాలని విద్యాశాఖ భావిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.