హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్ 2024) షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఈఏపీసెట్ 2024 కన్వినర్, జేఎన్‌టీయూ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బి డీన్ కుమార్ మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 21వ తేదీన ఈఏపీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఎలాంటి ఆలస్య రుసుం చెల్లించకుండా చివరి తేదీ ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించున్నట్లు తెల్పింది. ఇక మే 9 నుంచి 12 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలు మొత్తం 4 రోజులపాటు జరగనున్నాయి. కాగా ఇటీవల ఎంసెట్ పరీక్ష పేరును తెలంగాణ ప్రభుత్వం ఈఏపీసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే.
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH), తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE)లకు సంబంధించిన సీనియర్ అధికారులు మంగళవారం తెలంగాణ EAPCET-2024 మొదటి CET కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో TS EAPCET షెడ్యూల్ ఖరారు చేశారు. తెలంగాణ ఈఏపీసెట్ 2024 సిలబస్‌పై కూడా స్పష్టత ఇచ్చింది. TS EAPCET సిబలస్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సిలబస్ వంద శాతం ఉంటుందని షెడ్యూల్‌లో పేర్కొంది.
మరిన్ని తాజా విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.