Telangana Eamcet 2022 exams: తెలంగాణ ఎంసెట్ 2022 పరీక్షలు జులైలో జరగనున్నాయి. తాజాగా జేఈఈ మెయిన్ పరీక్షల (JEE Main 2022 exam dates) కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షల తేదీలు మారిన విషయం తెలిసిందే. ఇంటర్ పరీక్షల తేదీలు మారడంతో టీఎస్ ఎంసెట్ 2022 పరీక్షలు కూడా కొంత ఆలస్యం కానున్నాయి. ఈ ఏడాది జులై మొదటి లేదా రెండో వారంలో ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇంటర్ పరీక్షలు మే 7 వ తేదీతో ముగియాల్సి ఉండగా.. తాజాగా ప్రకటించిన కొత్త షెడ్యూల్ ప్రకారం.. మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ ఫస్టియర్ (మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీలు), సెకండియర్ (మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీలు) ఎగ్జామ్స్ జరుగుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డు (TSBIE) బుధవారం (మార్చి 16) వెల్లడించింది. ఆ ప్రకారంగా ఇంటర్ పరీక్షలు మే 24తో ముగుస్తాయన్నమాట. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు సన్నద్దమయ్యేందుకు 45 రోజుల వ్యవధి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారంగా చూస్తే.. జులై మొదటి వారంలో ఎంసెట్‌ను నిర్వహించే అవకాశం ఉంది. మరో వైపు జులై 3 వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఉన్నందున ఎంసెట్‌ను మొదటి వారంలో నిర్వహిస్తే.. విద్యార్థులకు ఇబ్బంది అవుతుందేమోనని అధికారులు ఆలోచనలోపడ్డారు. ఐతే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ కు సన్నద్దమయ్యే విద్యార్థులు ఎంసెట్‌ను సునాయసంగా రాస్తారని, ప్రత్యేకంగా సిద్దం కావాల్సిన అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎంసెట్ పరీక్షలు జులైలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: