హైదరాబాద్, జూన్ 17: తెలంగాణలో డీఎస్సీ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. జూన్ 12వ తేదీన విడుదలైన టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు తెలంగాణ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానం శనివారం (జూన్ 15) రాత్రి నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. కాగా గతంలో టెట్ పరీక్షకు దరఖాస్తు ఫీజు పెంచడం, దాన్ని తగ్గించాలని అభ్యర్థులు డిమాండ్ చేయడం తెలిసిందే. అయితే నాటి పరిస్థితుల కారణంగా టెట్ ఫీజు తగ్గించలేక పోయామని, ఈ క్రమంలో ఆనాడు దరఖాస్తు ఫీజు తగ్గించలేని పరిస్థితి ఉన్నందున డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఇస్తామని జూన్ 12వ తేదీన టెట్ ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్‌లో ఉత్తీర్ణత సాధించని వారు మాత్రం వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
కాగా మొత్తం 11,062 టీచర్ పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా.. టెట్ ఫలితాల నేపథ్యంలో ఆన్‌లైన్ దరఖాస్తుల తుది గడువును జూన్ 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీకి ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక డీఎస్సీ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ లో జరగనున్నాయి.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే ఎంఈడీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష వాయిదా పడింది. గతంలో ప్రకటించిన జూన్ 18వ తేదీకి బదులుగా జూన్ 19వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా శ్రీరంగప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 18న యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఉన్నందున జూన్ 19వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.