హైదరాబాద్, జులై 4: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలు (టీజీ సీపీగెట్ 2024) జులై 6న జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ పరీక్షలు జులై 10, 14 తేదీల్లో మినహా జులై 16 వరకు నిర్వహించనున్నారు. సీపీగెట్ పరీక్షల హాల్‌టికెట్లను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఎగ్జామ్ పేపర్ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది.
టీజీ సీపీగెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని దాదాపు 297 పీజీ కాలేజీల్లో మొత్తం 51 కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. సీపీగెట్ ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ఇతర సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
టీజీ సీపీగెట్ 2024 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాధారణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఉమ్మడి టైం టేబుల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు మేల్కొలిపి వ్యాయామం చేయించాలి. ఉదయం ఏడు గంటలకు టిఫిన్, ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు విద్యార్థులకు క్లాసులు, 5, 6, 7 తరగతులకు మధ్యాహ్నం 12.45 నుంచి 1.30 వరకు, 8వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 1.25 నుంచి 2.15 గంటల వరకు భోజనం అందిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 4.45 వరకు స్నాక్స్, అనంతరం 5.45 గంటల వరకు ఆటలు, సాయంత్రం 6.15 నుంచి ఏడు గంటల వరకు రాత్రి భోజనం, రాత్రి తొమ్మిది గంటలకు విద్యార్థులంతా నిద్రపోయేలా టైం టేబుల్ రూపొందించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.