AP Degree Online Admissions 2025: ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాల్లో వింత సమస్య.. తలలు పట్టుకుంటున్న అధికారులు! ఇంతకీ సంగతేమంటే..

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కాలేజీల నుంచి సైతం రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వడంతో కొన్ని ప్రాంతాల్లోని కాలేజీలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఎక్కువ సమయం పడుతోంది..

AP Degree Online Admissions 2025: ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాల్లో వింత సమస్య.. తలలు పట్టుకుంటున్న అధికారులు! ఇంతకీ సంగతేమంటే..
Degree Online Admissions

Updated on: Aug 31, 2025 | 3:13 PM

అమరావతి, ఆగస్ట్‌ 31: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కాలేజీల నుంచి సైతం రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వడంతో కొన్ని ప్రాంతాల్లోని కాలేజీలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఈ ఏడాది డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు విద్యార్థులు నేరుగా నమోదు చేసుకోవడంతో పాటు కాలేజీల నుంచి కూడా ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించడంతో ఈ గందరగోళం ఏర్పడింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలకు ఇప్పటి వరకు సుమారు 2 వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక విజయవాడలోని సిద్దార్థ కాలేజీకి సుమారు 1330 వరకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో వీటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం సిబ్బందికి సవాలుగా మారింది. ఒక్కో విద్యార్థి వివరాల నమోదుకు సుమారు 20 నిమిషాలకుపైగా సమయం పడుతోందని వాపోతున్నారు. అందరి వివరాలను నమోదు చేయలేక ఇబ్బందిపడుతున్నారు. దీంతో విద్యార్ధులనే నేరుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్ధులకు ఫోన్లు చేసి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. డిగ్రీ ప్రవేశాలు ఎక్కువగా ఉండే కాలేజీల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ గడువు సెప్టెంబరు ఒకటో తారీకుతో ముగుస్తుంది. దీంతో విభాగాల వారీగా అధ్యాపకులను, కంప్యూటర్లను ఏర్పాటు చేసి.. విద్యార్ధుల వివరాలను నమోదు చేయడం మొదలుపెట్టారు.

ఏపీ ఈఏపీసెట్‌ 2025 మూడో విడత కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు..!

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌కు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న అభ్యర్థనల మేరకు మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు ఈఏపీసెట్‌ కమిటీ సోమవారం (సెప్టెంబర్‌ 1) ఉన్నత విద్యామండలిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.