
హైదరాబాద్, ఆగస్టు 10: దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 త్వరలోనే నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పరీక్ష తేదీలను కూడా విడుదల చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 13వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్) 2025 పరీక్ష తేదీల్లో మార్పు చేస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటన జారీ చేసింది.
తిరిగి సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు కమిషన్ తెలిపింది.
దోస్త్ ప్రత్యేక విడత ద్వారా డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువును పొడిగించింది. దీనితోపాటు ఆయా కాలేజీల్లో ధ్రువపత్రాలు ఇచ్చి రిపోర్టింగ్ చేసే గడువును కూడా పొడిగించింది. ఆగస్టు 12వ తేదీ వరకు ఇందుకు అవకాశం ఇస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ వి బాలకిష్టారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 6వ తేదీతో తుది గడువు ముగిసింది. రాష్ట్రంలో కురుస్తున్న వరుస వర్షాలు, సెలవుల కారణంగా గడువు తేదీని పొడిగించమని వినతులు అందాయని, ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ ప్రవేశాలను సైతం ఆగస్టు 14వ తేదీలోపు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.