
అమరావతి, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్ధులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్‌మెంట్ 2) బుధవారం నుంచి ప్రారంభమైనాయి. ఏప్రిల్ 15 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 6 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమైనాయి. ఆయా తేదీల్లో ఈ తరగతులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఇక 9వ తరగతి విద్యార్థులకు పదో తరగతి పరీక్షల మాదిరి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక ప్రాథమిక తరగతులకు (1 నుంచి 5 తరగతులు) ఏప్రిల్ 9న ఫస్ట్ లాంగ్వేజ్, 10న ఇంగ్లిష్, 11న గణితం, 12న ఈవీఎస్ (3, 4, 5 తరగతులు),15న ఓఎస్‌ఎస్‌సీ (3, 4, 5 తరగతులు) పరీక్షలు జరుగుతాయి.
ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షల పూర్తవగా మరో 10 రోజుల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ప్రారంభం కాగా, మొదటి సంవత్సరం ప్రవేశాలు సోమవారం నుంచి ప్రారంభమైనాయి. పదో తరగతి హాల్‌టికెట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించి, ఫలితాలు వచ్చాక అడ్మిషన్ ఖరారు చేయనున్నారు.
1 నుంచి 9 తరగతులకు పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి మొత్తం ప్రక్రియ ఈ నెల 23వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. మరోవైపు ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు కూడా ఏప్రిల్ 23 వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత విద్యార్ధులందరికీ ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి పాఠశాలలు జూన్ 12వ తేదీన తెరచుకుంటాయి. కొత్త విద్యాసంవత్సరం (2025-26) ప్రారంభంనాటికి కొత్త విద్యా సంస్కరణలు తీసుకువచ్చేలా విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. కొత్త యూనీఫాం, కొత్త పాఠపుస్తకాలు, కొత్త కరిక్యులమ్‌తో విద్యావిధానమంతా కొత్తగా మారనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.