హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అపార్ ఐడీ జారీ చేస్తుంది. 12 అంకెల అపార్ ఐడీ ప్రతి విద్యార్దికీ కేటాయిస్తున్నారు. దీనిని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటారు. ఈ పథకం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 కింద అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆధార్ గుర్తింపు కార్డులో ఉన్నట్లే పాఠశాలల రికార్డుల్లోని వివరాలను జనవరి 31వ తేదీలోగా మార్చుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఆధార్, పాఠశాల రికార్డుల్లో ఒకే విధంగా విద్యార్థి పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం తదితర వివరాలు ఉండేలా చూసుకోవాలి. తొలుత ఆధార్‌లో తప్పులపు సరిచేసుకోవాలి. ఆ తర్వాత పాఠశాలల రికార్డుల్లో మార్చుకోవాలి. ఈ వివరాల ఆధారంగానే అపార్ ఐడీ కేటాయిస్తారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7.75 కోట్ల మంది విద్యార్ధులకి అపార్ ఐడీ మంజూరు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబరు 18వ తేదీ వరకు 2.10 లక్షల మంది అంటే కేవలం 3 శాతం మందికి మాత్రమే ఈ ఐడీ కేటాయించారు. రాష్ట్రంలో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సూచించారు. వివరాల మార్పులు చేసేందుకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎంఈఓలకు, ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, మోడల్, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంఈఓలకు, ఉన్నత పాఠశాలల్లో డిప్యూటీ ఈఓ లేదా డీఈఓలకు ఈ మార్పులు చేసే అధికారం ఇచ్చారు.
జాతీయ నూతన విద్యా విధానం-2020భాగంగా కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ పేరిట ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ సంఖ్య ఇచ్చే ప్రక్రియ. దీనిని 2023లో కేంద్ర సర్కార్ ప్రారంభించింది. ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ఒకటే నంబరు ఉంటుంది. తద్వారా విద్యార్థుల డ్రాపౌట్లు, పాఠశాలలు మారినా, ఒక రాష్ట్రం నుంచి దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా విద్యార్ధి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల సర్టిఫికెట్లు, క్రెడిట్లను నిక్షిప్తం చేసే అకడమిక్ బ్యాంకు క్రెడిట్ (ఏబీసీ)తో అపార్ ఐడీ అనుసంధానమై ఉంటుంది. దానివల్ల సర్టిఫికెట్ల భద్రతకు కూడా ఇబ్బంది ఉండదు.