RRB Exam Dates Changed: రైల్వే ఉద్యోగాల రాత పరీక్ష తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్ ఇదే!
దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైల్వే జోన్లలో 41 వేలకు పైగా రైల్వే ఉద్యోగాలకు ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలన్నింటికీ త్వరలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు గతంలో రైల్వే శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే తాజాగా కొన్ని కారణాల రిత్య పరీక్ష తేదీలను మారుస్తున్నట్లు మరో ప్రకటనల వెలువరించింది..
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాలకు నిర్వహించవల్సిన రాత పరీక్ష తేదీలను నోటిఫికేషన్ సమయంలో వెల్లడించలేదు. ఇటీవల ఆయా జాబ్‌లకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు ఆ శాఖ ముఖ్య ప్రకటనను జారీ చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి గతంలో ప్రకటించిన పరీక్ష తేదీలను మార్చుతూ తాజాగా రివైజ్‌డ్ నోటీసును విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం.. ఆర్‌పీఎఫ్ ఎస్సై, టెక్నీషియన్, జేఈ రాత పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ నవంబర్, డిసెంబర్ నెలల్లోనే జరుగనున్నట్లు తెలుస్తుంది. పరీక్షలకు 10 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో ఎగ్జామ్ సిటీ, తేదీ వివరాలు వెల్లడిస్తారు. ఇక 4 రోజుల ముందుగా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు రైల్వే శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. పరీక్షకు ఆధార్ లింక్‌డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తమతోపాటు పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ మేరకు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షల కొత్త తేదీలు ఇవే…
- ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1) పోస్టులకు రాత పరీక్షలు నవంబర్ 25, 2024 నుంచి 29 వరకు జరుగుతాయి.
- ఆర్‌పీఎఫ్ ఎస్సై పోస్టులకు రాత పరీక్షలు డిసెంబర్ 02, 2024 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి.
- టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్షలు డిసెంబర్ 18, 2024 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయి.
- జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రాత పరీక్షలు డిసెంబర్ 13, 2024 నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయి.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, 452 ఆర్‌పీఎఫ్ ఎస్సై పోస్టులు, 14,298 టెక్నీషియన్ పోస్టులు, 7951 జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 41,500 ఖాళీల భర్తీకి రైల్వే శాఖ ఈ నియామక పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పోస్టులన్నింటికీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్‌టీపీసీ, పారామెడికల్, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష తేదీలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సీరియస్‌గా సన్నద్ధమవుతున్నారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.