Liquor Container: ఫుల్‌లోడ్‌ మద్యంతో వెళ్తున్న లారీ రోడ్డుపై బోల్తా.. కోట్ల రూపాయల సరుకు సెకన్లలో ఎత్తుకుపోయిన జనాలు

రోడ్డుపై ఆగి వున్న మద్యం లోడ్ లారీని మరో లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. అంతే.. మద్యం సీసాలన్నీ రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోయాయి. గమనించిన స్థానికులు సెకన్ల వ్యవధిలోనే కోట్ల రూపాయల సరుకును దొరికిన కాడికి ఎత్తుకుపోయారు..

Liquor Container: ఫుల్‌లోడ్‌ మద్యంతో వెళ్తున్న లారీ రోడ్డుపై బోల్తా.. కోట్ల రూపాయల సరుకు సెకన్లలో ఎత్తుకుపోయిన జనాలు
Liquor Container
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 24, 2024 | 6:02 PM

మహబూబ్ నగర్, అక్టోబర్‌ 24: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఆగివున్న లిక్కర్ కంటైనర్ను వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. గురువారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. మద్యం లోడ్‌తో నిండుగా ఉన్న కంటైనర్‌ హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో మద్యం కంటైనర్‌లోని మద్యం కాటన్లన్నీ బయట చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది చూసిన వాహనదారులు రోడ్డుపై వాహనాలను నిలిపి మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. కొందరైతే కాటన్లు కాటన్లు చిక్కిన కాడికి ఎత్తుకుపోయారు. మరికొందరు చేతికి అందిన మేరకు సీసాలు పట్టుకుని ఉడాయించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

మహబూబ్‌ నగర్ జిల్లా జడ్చర్లలో హైదరాబాద్‌ -బెంగళూరు జాతీయ రహదారి నంబర్‌ 44పై మద్యం కంటైనర్‌తోపాటు మరికొన్ని లారీలు నిలిచి ఉన్నాయి. ఇంతలో అతివేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ఆగి ఉన్న లారీలను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో ఆగివున్న ఆ లారీతోపాటు మిగతా లారీలు కూడా బోల్తా పడ్డాయి. బోల్తా పడిన లారీల్లో మద్యం లోడుతో ఉన్న కంటైనర్ కూడా ఉంది. గమనించిన రోడ్డుపై వెళ్లే వాహనదారులతోపాటు స్థానికులు మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడి స్థానికులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అలస్యం అయ్యింది. చాలా వరకు మద్యం సీసాలను స్థానికులు తీసుకెళ్లిపోయారు. పెబ్బేరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

నిర్లక్ష్యంగా లారీ నడిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. ఆ సమయంలో మద్యం సేవించి మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగనప్పటికీ.. కొందరు డ్రైవర్లకు మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంలో మద్యం లూటీ సంఘటనపై సంబంధిత యజమాని పోలీసులకు ఇంకా ఫిర్యాదు చేయలేదు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కంటైనర్లను క్రేన్ సహాయంతో పోలీసులు పక్కకు తొలగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.