
హైదరాబాద్, ఆగస్ట్ 12: దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల దరఖాస్తులను సవరించుకోవడానికి ఆగస్టు 19 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఆగస్టు 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ముగిసింది. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సవరించేందుకు ఆగస్టు 10 నుంచి అవకాశం కల్పించారు. ఆగస్టు 19 వరకు వివరాలను సరిచేసుకోవచ్చు. ఇక రాత పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించనుంది.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వేలో వివిధ విభాగాల్లో మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-3 పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ రాతపరీక్ష, మెడికల్ పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీ గడువును పెంచుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది. ఈ గడువును ఆగస్ట్ 18వ తేదీ వరకు పొడిగించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 10వ తేదీ వరకు తుది గడువు ఉండగా.. దానిని తాజాగా పొడిగించింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి సీశాబ్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న కారణాల వల్ల గడువును పొడిగించారు. ఇక ఈఏపీసెట్‌లో ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను ఆగస్టు 30వ తేదీలోపు ఉన్నత విద్యామండలికి సమర్పించాలని తెలిపింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.