‘నా జీతం సగం తగ్గించండి.. లేదంటే బదిలీ చేయండి’ IAS అధికారి లేఖతో రగిలిన పొలిటికల్ పైర్
తన జీతాన్ని సగానికి తగ్గించండి లేదా చట్టప్రకారం విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న పోస్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర నియామక, సిబ్బంది శాఖను కోరుతూ ఓ IAS అధికారి నియామక అధికారులకు లేఖ రాశారో. ఈ మేరకు ఐదు పేజీల లేఖలో రింకు సింగ్ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ వర్మ పేర్లను ఈ లేఖలో ప్రస్తావిస్తూ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు..

లక్నో, జూలై 21: ఉత్తరప్రదేశ్‌కు చెందిన 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రాహి రాసిన లేఖ రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎస్‌డీఎం (జ్యుడీషియల్)గా పనిచేస్తున్న రింకు సింగ్.. తనకు రోజుకు కేవలం నాలుగు గంటల పని మాత్రమే ఉంటోందని లేఖలో పేర్కొన్నారు. తన జీతాన్ని సగానికి తగ్గించండి లేదా చట్టప్రకారం విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న పోస్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర నియామక, సిబ్బంది శాఖను కోరారు. ఈ మేరకు ఐదు పేజీల లేఖలో రింకు సింగ్ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ వర్మ పేర్లను ప్రస్తావిస్తూ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు.
అక్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు?
తాను జాలౌన్‌లో ఎస్‌డీఎంగా పనిచేస్తున్న సమయంలో, తహసీల్ పరిధిలోని అక్రమ భూ ఆక్రమణల కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ తనకు సూచించారని రింకు సింగ్ లేఖలో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ఎమ్మెల్యే గౌరీ శంకర్ వర్మ సమక్షంలో ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు. అలాగే మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ పేరుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ ఆక్రమణలపై నిష్పాక్షిక విచారణ జరగకుండా అడ్డుకునేందుకు కుట్ర జరిగిందని కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
కోల్డ్ స్టోరేజ్ వివాదం.. తొందరపాటి బదిలీ?
మంత్రి సన్నిహిత బంధువు, బ్లాక్ చీఫ్ అయిన రామ్‌రాజా నిరంజన్‌కు చెందిన కోల్డ్ స్టోరేజ్ కేంద్రం చుట్టూ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారని రాహి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించకముందే తనను జాలౌన్ ఎస్‌డీఎం పదవి నుంచి ఎస్‌డీఎం (జ్యుడీషియల్)గా హడావుడిగా బదిలీ చేశారని పేర్కొన్నారు. లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది మరణించిన ఘటన తర్వాత భద్రతా ప్రమాణాలను పరిశీలించే క్రమంలో తాను రామ్‌రాజా నిరంజన్ కోల్డ్ స్టోరేజ్‌ను తనిఖీ చేసినట్లు తెలిపారు. అక్కడ నిర్వహించిన 10 నిమిషాల మాక్ ఫైర్ డ్రిల్ సమయంలో ఎలాంటి అగ్నిమాపక చర్యలు చేపట్టలేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్వహణకు అవసరమైన పలు పత్రాలు కూడా అందుబాటులో లేవని నివేదికలు కోరినట్లు వెల్లడించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పేరుకే..
జాలౌన్ జిల్లా పరిపాలన పనితీరుపై కూడా రింకు సింగ్ విమర్శలు చేశారు. జిల్లా కలెక్టర్ నిర్వహించే జనతా దర్శన్ కార్యక్రమం కేవలం ఒక లాంఛనంగా మారిపోయిందని ఆరోపించారు. ప్రజల సమస్యలకు మూల కారణాలను పరిష్కరించకుండా తాత్కాలిక పరిష్కారాలకే పరిమితమవుతున్నారని పేర్కొన్నారు. తాను నిబంధనలకు అనుగుణంగా, స్వతంత్రంగా పనిచేయగలిగే విధంగా జాలౌన్‌లోని మరో తహసీల్‌కు లేదా ఇతర జిల్లాకు బదిలీ చేయాలని రింకు సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌లో అలాంటి అవకాశం లేకపోతే, ఇతర రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై పంపాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాగా రింకు సింగ్ చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు, నేతల నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.
