Engineering Counselling: ‘ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు నాలుగో విడత కౌన్సెలింగ్ జరపాలి’ హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ఓ విద్యార్ధి తల్లి హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. వరదల కారణంగా చాలా మంది విద్యార్ధులు ప్రవేశాలు పొందలేకపోయారని, వారందరికీ మరోమారు కౌన్సెలింగ్ జరిపి సీట్లు ఇవ్వాలని ఆమె పిటిషన్ లో కోరారు..
అమరావతి, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇంజినీరింగ్‌తోపాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన విద్యార్థి తల్లి పలగర అనసూర్య.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సుమారు 25 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశాలకు అర్హులున్నప్పుడు సీట్లను వృథా చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కౌన్సెలింగ్ సమయంలో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వరదలు సంభవించాయని, వరదల కారణంగా తన కుమారుడితోపాటు, పలువురు విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోయారని, నచ్చిన బ్రాంచ్‌ల్లో సీట్లు పొందలేకపోయారని ఆమె పేర్కొన్నారు. అందుకే మిగిలి పోయిన సీట్లను నాలుగో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలని అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోలేదని, అందుకే కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల తుది మెరిట్ జాబితా విడుదల.. ప్రకటన వెలువరించిన కాళోజీ హెల్త్ వర్సిటీ
తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఈఏపీసెట్ 2024లో వచ్చిన స్కోరు ఆధారంగా బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం మార్కులతో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సీట్ల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇందులో ఎంపికైన వారి వివరాలను వెల్లడించారు.