న్యూఢిల్లీ, డిసెంబర్ 20: షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ), ఇతర వెనకబడిన ఓబీసీ అభ్యర్థులకు 2016 నుంచి దాదాపు 4 లక్షలకుపైగా బ్యాక్‌లాగ్ రిజర్వ్‌డ్ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం (డిసెంబర్ 19) తెలిపారు. ఈ మేరకు ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు అందించిన డేటా ప్రకారం వెల్లడించినట్లు ఆయన తెలిపారు. రిజర్వ్‌డ్ కేటగిరీలో బ్యాక్‌లాగ్ ఖాళీలతో సహా ఉద్యోగ ఖాళీలు ఏర్పడటం, వాటిని వెనువెంటనే భర్తీ చేయడం.. ఇది నిరంతర ప్రక్రియని మంత్రి జితేంద్ర రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
బ్యాక్‌లాగ్ రిజర్వ్‌డ్ ఖాళీలు ఏర్పడటానికి గల మూలకారణాన్ని అధ్యయనం చేయడానికి, ఖాళీలకు కారణమయ్యే కారకాలను తొలగించడానికి, వాటిని భర్తీ చేయడానికి ఓ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేసినట్లు మంత్రి సింగ్ అన్నారు. అలాగే ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లను కూడా ఎప్పటికప్పుడు నిర్వహించేలా అదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు, సూచనలను సక్రమంగా పాటించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి మంత్రిత్వ శాఖ, ప్రతి విభాగంలో డిప్యూటీ సెక్రటరీ, అంతకు పైస్థాయి అధికారిని లైజన్ ఆఫీసర్‌గా నియమించాలని మంత్రి అన్నారు. ప్రతి మంత్రిత్వ శాఖ విధుల నిర్వహణలో ఉద్యోగులకు సహాయం చేయడానికి లైజన్ ఆఫీసర్ ప్రత్యక్ష నియంత్రణలో ప్రత్యేక రిజర్వేషన్ సెల్‌ను సైతం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీల వివరాలను సంబంధిత మంత్రిత్వ శాఖల పరిధిలోని సంబంధిత ప్రభుత్వ సంస్థలు మాత్రమే నిర్వహిస్తాయని, వీటిల్లో ఖాళీగా ఉన్న పోస్టులను సకాలంలో భర్తీ చేసేలా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం అందించారు.