చెన్నై, నవంబర్ 22: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. కోస్టల్ఏరియాతోపాటు పలు జిల్లాల్లో మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాల కారణంగా బుధవారం (నవంబర్ 22), గురువారాల్లో (నవంబర్ 23) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరిలో బుధవారం (నవంబర్ 22) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తమిళనాడులోని 18 జిల్లాలకు పైగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కన్యాకుమారిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులోని తిరునెల్వేలి, తెన్కాసి, రామనాథపురం, విరుదునగర్, కోయంబత్తూరు, నీలగిరి, తిరువళ్లూరు, రాణిపేట్, తూత్తుకుడి, మధురై, దిండిగల్, చెంగల్పట్టు, నాగపట్నం, తిరుపూర్, కాంచీపురం, చెన్నై, మైలాడుతురై, తిరువారూర్ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. అలాగే పుదుచ్చేరి, కారైకాల్ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరిలో జనజీవనం స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్లపై వర్షం నీరు చేరడంతో రోడ్లు నదులను తలపించాయి.
వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు వచ్చే రెండు రోజులు అంటే నవంబర్ 23, 24 తేదీల్లో మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి హోంమంత్రి నమశ్శివాయం ఓ ప్రకటనలో తెలిపారు. పుదుచ్చేరిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం తమిళనాడులోని 35 జిల్లాల్లో 13.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగపట్నంలో అత్యధికంగా 11.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైనట్లు తెల్పింది. ఇక కేరళలోని పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెం.మీ, 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
మత్స్యకారులు రెండుమూడు రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని పుదుచ్చేరి మత్స్యశాఖ ఆదేశించింది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, యానాంలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.