న్యూఢిల్లీ, జనవరి 16: దేశ వ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది పెద్ద ఎత్తున దుమారం లేపిన నీట్ పేపర్ లీక్ యవ్వారం మళ్లీ రిపీట్ కాకూడదంటే ఆన్‌లైన్‌లో నీట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిన్నమొన్నటి వరకు ఊగిసలాడిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌కే మొగ్గు చూపింది. దేశమంతా ఒకే రోజు.. ఒకే షిఫ్టులో.. పెన్-పేపర్ పద్ధతిలోనే నీట్ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నీట్ పరీక్ష విధానంపై జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) సంచలన ప్రకటన జారీ చేసింది. సింగిల్ డే – సింగిల్ షిఫ్ట్‌లో పెన్- పేపర్ మోడ్ (ఓఎంఆర్ బేస్డ్)లో నీట్ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం చివరకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్టీయే అధికారికంగా వెల్లడించింది.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న మెడికాల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్ వంటి మెడికల్ కోర్సులకు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష యేటా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నీట్ (యూజీ) ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్‌ఎంఎస్ కోర్సు అడ్మిషన్లతో పాటు ఆర్మ్‌డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్‌లో బీఎస్‌సీ నర్సింగ్ కోర్సు అడ్మిషన్లు జరుపుతారు. వీటన్నింటికీ నీట్ యూజీలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. నాలుగేండ్ల బీఎస్‌సీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ (యూజీ)లో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. గతేడాది నీట్ యూజీ 2024 పరీక్షకు దేశ వ్యాప్తగా 24 లక్షల మంది హాజరయ్యారు.
NEET UG 2025 to be conducted in Pen and Paper mode (OMR based) in Single day and Single Shift. pic.twitter.com/H1DYTgSGqI
— National Testing Agency (@NTA_Exams) January 16, 2025
అయితే పేపర్ లీకేజీల నేపథ్యంలో జేఈఈ మెయిన్ తరహాలోనే నీట్ యూజీ 2025 పరీక్ష కూడా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ తొలత భావించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్ విధానంలోనే నీట్ నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే, విస్తృత చర్చల అనంతరం కేంద్రం ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.