న్యూఢిల్లీ, జులై 17: దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు జవహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ – 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు సెప్టెంబరు 16, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద దేశంలోని మొత్తం 653 విద్యాలయాల్లో సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. తెలంగాణ-9, ఆంధ్రప్రదేశ్-15 చొప్పున విద్యాలయాలున్నాయి.
01-05-2013 నుంచి 31-07-2015 మధ్య జన్మించిన వారు అర్హులు. ఈ పరీక్ష రెండు సెషన్ల చొప్పున జరుగుతుంది. ఏప్రిల్ 12, 2025 (శనివారం) ఉదయం 11 గంటలకు ఒక సెషన్ పరీక్ష జరుగుతుంది. మిగిలిన విద్యార్ధులకు జనవరి 18, 2025వ తేదీ ఉదయం 11.30 గంటలకు పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు. తెలుగుతో సహా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ, బోడో, బెంగాళీ, అస్సామీ, పంజాబీ వంటి అన్ని స్థానిక భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
రాత పరీక్ష ఆయా తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 3 విభాగాల నుంచి 80 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 50 మార్కులు, అర్ధమెటిక్ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు, ల్యాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 2 గంటల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఓఎమ్మార్ షీట్‌పై సరైన సమాధానాలను గుర్తించవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1.25 మార్కుల చొప్పున కోత ఉంటుంది.