JNV 6th Admissions 2024: తెలుగు రాష్ట్రాల్లోని పేద విద్యార్ధులకు మరో ఛాన్స్.. నవోదయ ఆరో తరగతి ప్రవేశాల గడువు మళ్లీ పెంపు
దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ దరఖాస్తు గడువు మరోమారు పొడిగించారు. ఈ మేరకు జేఎన్‌వీ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు సెప్టెంబర్ 23వ తేదీతో ఆరో తరగతి ప్రవేశాల గడువు..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ దరఖాస్తు గడువు మరోమారు పొడిగించారు. ఈ మేరకు జేఎన్‌వీ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు సెప్టెంబర్ 23వ తేదీతో ఆరో తరగతి ప్రవేశాల గడువు ముగిసింది. అయితే ఈ గడువును అక్టోబర్ 7, 2024వ తేదీ మరకు పొడిగిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ప్రకటన వెలువరించింది. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 653 జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే 24 వరకు నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. యేటా వీటిల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. అలాగే బాలురకు, బాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
హిందీ, ఇంగ్లిష్, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం. ఆరో తగరతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తెలుగుతో సహా మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు తాజాగా దరఖాస్తు తేదీ పెరిగడంతో మరో అవకాశం ఇచ్చినట్లైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ ఉన్న విద్యార్థులు ఎవరైనా ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్థుల మే 01, 2013 నుంచి జులై 31, 2015 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. యేటా నవోదయలో ప్రవేశాలకు వేల సంఖ్యలో విద్యార్ధులు పోటీ పడుతుంటారన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ లాసెట్ 2024 చివరి విడత వెబ్ ఆప్షన్లు ప్రారంభం
తెలంగాణ లాసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 21తో ముగిసింది. ఇక ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి ఈ రోజుతో ముగింపు గడువు ముగుస్తుందని ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేశ్‌బాబు తెలిపారు. ఎల్ఎల్‌బి చివరి విడత వెబ్ ఆప్షన్లను సెప్టెంబర్ 25వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 30న సీట్లు కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి 4వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయవల్సి ఉంటుంది. అలాగే ధ్రువపత్రాల పరిశీలన కూడా చేయించుకోవాలి.