International Law School to AP: ‘అమరావతిలో వంద ఎకరాల్లో అంతర్జాతీయ లా కాలేజీ’.. సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో అత్యుత్తమ లా కాలేజీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మాదిరి ప్రతిష్ఠాత్మక సంస్థల తరహాలో ఈ కాలేజీని నిర్మించనున్నట్లు ఆయన..
అమరావతి, సెప్టెంబర్ 24: అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో అత్యుత్తమ లా కాలేజీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మాదిరి ప్రతిష్ఠాత్మక సంస్థల తరహాలో ఈ కాలేజీని నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటు చేసే విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. సెప్టెంబర్ 23న సచివాలయంలో న్యాయశాఖపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన పంపుతామన్నారు. ఇందుకోసం త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే జూనియర్ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు వారికి నెలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. జూనియర్ లాయర్ల గౌరవ భృతికి సంబంధించిన విషయాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో బాబు పేర్కొన్న సంగతి తెలిసిందే. వీటన్నింటితోపాటు జూనియర్ లాయర్ల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సెట్-2024 ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల.. సెప్టెంబర్ 26 వరకు అభ్యంతరాల స్వీకరణ
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్)-2024 ప్రిలిమినరీ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్ధులు సెప్టెంబర్ 26వ తేదీలోగా కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ నియామకాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యేటా తెలంగాణ సెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో సెట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు.