MBBS students must complete internships in same institute: ఎంబీబీఎస్ చదివేది ప్రైవేటు వైద్య కళాశాలలో.. ఇంటర్న్‌షిప్ మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో.. అత్యధిక ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఇదే తంతు కొనసాగుతోంది. వైద్య విద్యార్థులు కూడా తమకు మెరుగైన అనుభవపూర్వక శిక్షణ లభిస్తుందనే ఉద్దేశంతో.. ప్రభుత్వ కళాశాలల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ వ్యవహారానికి తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అడ్టుకట్ట వేసింది. ఇకనుంచి ఎక్కడ ఎంబీబీఎస్ (MBBS Internship) పూర్తి చేస్తారో.. అదే వైద్య కళాశాలకు చెందిన అనుబంధ బోధనాసుపత్రిలోనే ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాలనే కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. నవంబరు 2021 తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇది వర్తిస్తుందని ఎన్‌ఎంసీ పేర్కొంది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అవసరమైన చర్యలు చేపట్టింది. ఆయా కళాశాలల విద్యార్థులకు వాటి బోధనాసుపత్రుల్లోనే ఇంటర్న్‌షిప్ కల్పించాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను ఆదేశించింది.
కాగా ఎన్‌ఎంసీకి వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి ఇటీవల లేఖ రాశారు. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లో మొత్తం 500 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరు కాకుండా మరో 500 మందిని రెండు చోట్లా ఇంటర్న్‌షిప్‌నకు చేర్చుకుంటున్నామన్నారు. సవరించిన తాజా నిబంధనలను బట్టి రాష్ట్రంలోని కళాశాలల్లోని విద్యార్థుల సంఖ్య కంటే ఇతర విద్యార్థులను తీసుకోకుండా ఉత్తర్వులు సవరించాలని కోరారు.
12 నెలలలోపు పూర్తి చేయాలి
ఇంటర్న్‌షిప్ పూర్తయిన అనంతరమే ఎంబీబీఎస్ పట్టాను రాష్ట్ర వైద్యమండలిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన రెండేళ్లలోపు 12 నెలలు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. విదేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసి వచ్చిన వారైతే అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన రెండేళ్లలోపు చేయాలి. వీరు ముందస్తు అనుమతి పొందడం ద్వారా 15 రోజుల సాధారణ సెలవును, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి తల్లి ప్రసూతి సెలవులను తీసుకోవచ్చు. తండ్రి 2 వారాల పాటు పెటర్నిటీ లీవ్ పొందవచ్చు. ఆసుపత్రుల్లో ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు పీజీ వైద్యవిద్య పూర్తిచేసిన వైద్యుడిని తప్పనిసరిగా కేటాయించాలంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నెలనెలా ఉపకారవేతనం అందించాల్సి ఉంటుందని తెలిపింది.
విదేశీ విద్యార్థులకు వెసులుబాటు
విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు మన దేశంలో ఇంటర్న్‌షిప్ చేసుకోవడానికి ఎన్‌ఎంసీ వెసులుబాటు కల్పించింది. అయితే వీరికి తొలి ప్రాధాన్యంగా కొత్త వైద్య కళాశాలల్లో ఇంటర్న్‌షిప్‌ను కేటాయించాలని సూచించింది. ఏ ప్రభుత్వ వైద్య కళాశాలలోనైనా.. తమ ఇంటర్న్‌షిప్ సామర్థ్యంలో గరిష్ఠంగా 7.5 శాతం విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఇవ్వాలంది.
Also Read: