
అమరావతి, జూన్ 2: మెగా డీఎస్సీ పరీక్ష తేదీలు సమీపిస్తున్నాయి. ఇది అభ్యర్ధులు పరీక్షల కోసం ముమ్మరంగా సిద్ధం కావల్సిన సమయం. కానీ విద్యాశాఖ నిర్లక్ష్యం మూలంగా అటు చదవలేక.. ఇటు అధికారులను ఒప్పించలేక తీవ్ర మానసిక వ్యధను అనుభవిస్తున్నారు. అందుకు కారణం.. తాజాగా విడులైన మెగా డీఎస్సీ హాల్ టికెట్లే. యేళ్లుగా ఎదురు చూస్తున్న డీఎస్సీ ఇన్నాళ్లకు సర్కార్ విడుదల చేసినప్పటికీ అభ్యర్ధుల విజ్ఞప్తులను సర్కార్ పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తుంది. డీఎస్సీలో అభ్యర్ధులు 3, 4 పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా విడుదలైన హాల్ టికెట్లలో ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో కేటాయించారు. శనివారం (మే 31) ఉదయం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్న అభ్యర్థులు.. వాటిల్లోని పరీక్ష కేంద్రాలు చూసి ఆందోళన చెందుతున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థుల నుంచి దాదాపు 8 ఐచ్ఛికాలు తీసుకున్నారు. అయితే హాల్ టికెట్లలో అన్ని పరీక్షలకు ఒకే జిల్లాను కేటాయించకుండా కొన్ని పరీక్షలకు ఒక ఐచ్ఛికం, మరికొన్ని పరీక్షలకు మరో ఐచ్ఛికం ప్రకారం పరీక్ష కేంద్రాలు కేటాయించారు.
అయితే అభ్యర్థులు ఇచ్చిన మొదటి ఐచ్ఛికం ప్రకారంగానే పరీక్ష కేంద్రాలు కేటాయించామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. వాస్తవానికి 36,052 మందికి రెండో ఐచ్ఛికం, 24,714 మందికి మూడో ఐచ్ఛికం, 7,660 మందికి నాలుగో ఐచ్ఛికం, 2,168 మందికి ఐదో ఐచ్ఛికం కూడా పరీక్ష కేంద్రాలకు కేటాయించినట్లు అభ్యర్ధులు వాపోతున్నారు. దీంతో ఒక పరీక్ష ఒక చోట.. మరో పరీక్ష మరో చోట వచ్చిందని.. దీంతో పరీక్ష రాసేందుకు వెళ్లిరావడం పెద్ద ప్రయాసని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన చదలవాడ ధనలక్ష్మి అనే అభ్యర్ధికి టీజీటీ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం, అలాగే మ్యాథమెటిక్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె హైదరాబాద్‌లో ఉంటోంది. దరఖాస్తులో తొలి ఐచ్చికం హైదరాబాద్ కేటాయించి.. మిగిలిన ఐచ్చికాలు ఏపీలోని పలు జిల్లాలకు ఇచ్చారు. కానీ హాల్ టికెట్లలో జూన్ 6న టీజీటీ గణితం పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో.. జూన్ 9న స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం పరీక్ష హైదరాబాద్, జూన్ 12న స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్ష మళ్లీ విజయవాడలో కేటాయించారు. టీజీపీ పరీక్షకు జూన్ 24న నిర్వహించే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షను కూడా విజయవాడలోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. విజయనగరానికి చెందిన కొండా కుసుమ అనే అభ్యర్ధి కూడా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమెకు కూడా ఒక పరీక్ష హైదరాబాద్‌లో.. మరో పరీక్ష విజయనగరంలో ఇలా కేటాయించారు. ఒకటికి మించి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరికీ దాదాపు ఇదే విధంగా తికతికమగా పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
మెగా డీఎస్సీలో బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాధాన్యాలు ఆధారంగా వీలైనంత వరకూ ఒకే జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించామని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి చెప్పడం వింతగా ఉంది. కొందరికి మాత్రమే రెండు, మూడో ప్రాధాన్యత పరీక్ష కేంద్రాలను కేటాయించామని అన్నారు. ఈ మేరకు మెగా డీఎస్సీ హాల్‌టికెట్ల జారీ తర్వాత అభ్యర్థుల నుంచి వస్తున్న సందేహాలు, ఫిర్యాదులకు ఆయన వివరణ ఇచ్చారు. అలాగే టీజీటీ, పీజీటీ భాషేతర, ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్లభాష నైపుణ్య పరీక్ష (ఈపీటీ) ఉంటుందని, దీనికి పరీక్ష సమయం గంటన్నరని వెల్లడించామన్నారు. వ్యాయామవిద్య టీచర్ పోస్టుల గురించి మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థుల పాఠశాలలతోపాటు అన్నింటికీ ఒకే సిలబస్, పరీక్ష ఉంటుందని ఆయన అన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.