Malabar Gold: బంగారు అభరణాల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న మలబార్ గోల్డ్ అండ్ డైమ్సండ్స్ కంపెనీ తాజాగా భారీగా ఉద్యోగాల నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. కేరళకు చెందిన ఈ సంస్థ భారత దేశవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్ షోరూమ్‌లలో ఏకంగా 5వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయమై సంస్థ చైర్మన్ ఎం.పి అహమ్మద్ మంగళవారం ఓ ప్రకటన చేశారు. అంతేకాకుండా మహిళలకు శుభ వార్త తెలిపారు. సంస్థ తీసుకోనున్న ఈ 5వేల ఉద్యోగాల్లో సగం మహిళలకే కేటాయిస్తూ ప్రకటన చేశారు.
ఇందులో భాగంగా అకౌంటింట్, డిజైన్, డెవలప్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్, ఐటీ, అభరణాల తయారీ వంటి విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇటీవల బీటెక్/ఎంబీఏ వంటి డిగ్రీలను పూర్తి చేసుకున్న వారికి జువెలర్ రిటైల్ విక్రయాల గురించి అవగాహన కల్పించే క్రమంలో ఇంటర్నిషిప్, ట్రైనీ షిప్‌వంటి ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నామని తెలిపారు. కొత్తగా తీసుకోనున్న ఈ ఉద్యోగులు కేరళలోని కోజికోడ్‌లో ఉన్న మలబార్ కేంద్ర కార్యాలయంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కత కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు కంపెనీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని అమమ్మద్ తెలిపారు. ఇక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 10 దేశాల్లో సుమారు 260 షోరూమ్‌లను నిర్వహిస్తోంది. ఈ సంస్థ వార్షిక ఆదాయం రూ. 33,640 కోట్లకు పైమాటే.